. Director Vamsy Shared Experiences With SP Balu
Telugu Native[Dec-12-2020]    

Director Vamsy Shared Experiences With SP Balu


పొలమారిన జ్ఞాపకాలు........
ఇంత దగా చేసే రేంటి మేష్టారూ?

నా ఈ చిన్న జీవితంలో నేను చూసిన గొప్పవాళ్ళు ముగ్గురు ....ఇళయరాజా, బాలూ ,బాపూ.
వీళ్ళు వందేళ్ళ కోసారన్నా పుడతారో లేదో!!!
* * *
“నేనంటే నేనే ”సినిమా మా పక్కనే ఉన్న రామచంద్రపురం అన్నపూర్ణా పిక్చర్ పేలస్ లో మాగొప్పగా ఆడేసెళ్ళిన రోజులు.ఏకుర్రోడి నోట్లో చూసినా గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా అన్న పాటే .
సరిగ్గా అదే టైములో కిషోర్ టాకీస్ లో ఆపాట పాడిన గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం మ్యూజికల్ నైట్.
మొట్ట మొదట బాలూ గార్ని చూసింది ఆ రాత్రే,
దక్కను సిగరెట్టు పెట్టి డొక్కు మీద గుంతలకిడి గుమ్మా పాట పాడమని రాసి పట్టికెళ్ళిస్తే నవ్వుతా దాన్ని తీసుకుని “పాడతా వెళ్ళి కూర్చో” అన్నారు.
నాలాంటోళ్ళు చాలా మంది అడిగినియ్యన్నీ పాడిన బాలూ గారు లాస్ట్ లో గుంతలకిడి గుమ్మా పాడుతుంటే జనాల్లో చప్పట్లు, కేకలే కేకలు” ఒన్స్ మోర్” అంటా అరుపులు.
* * *
మద్రాసెళ్ళినప్పుడు , ఆవేళ మధ్యాన్నం మూడు గంటలు దాటేకా ఆయన్ని చూద్దామని మహాలింగపురం అయ్యప్ప గుడి దగ్గర్లో వున్న ఆ బాలూ గారింటి దగ్గర కెళ్తే ,అప్పటికే అక్కడ నిలబడి ఉన్న నాలాంటి అభిమానులకి సంతకాలు పెడతా“ఇప్పుడే రికార్డింగు నించొచ్చేను.భోంచేసి మళ్లీ వెళ్ళాలి.” అనేసి నవ్వుతా వాళ్ళని సాగనంపు తున్న ఆయన్ని కాస్తదూరాన్నించి చూసి ఇప్పుడు నేనెళ్ళి ఇబ్బంది పెట్ట కూడదనుకుంటా వెనక్కెళ్ళి పోయేను.
ఆతర్వాత నేను అసిస్టెంటుగా చేరిన నా మొదటి సినిమాఎదురీత రికార్డింగు జెమినీ స్టూడియోలో.”ఎదురీతకు అంతం లేదా” అన్నపాట పాడుతుంటే అద్దాల తలుపుల వెనక నించి చూశాను బాలూగార్ని.
శంకరాభరణానికి వేటూరిగారు రాసిన పాటల్ని కాపీలు రాస్తున్నప్పుడు ఆయన దృష్టిలో కెళ్ళిన నేను ఆ సినిమా వెండితెర నవల రాసిప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంటుతో కాస్తగుర్తుండి పోయే నాయనకి.
నేను డైరెక్ట్ చేసిన నాఫస్ట్ సినిమా మంచుపల్లకీలో పాటలు పాడటానికి జెమినీ స్టూడియో కొచ్చినప్పుడు నా గురించి చెప్పి గుర్తు చేస్తుంటే “అయ్యో నువ్వెందుకు గుర్తులేవు ?” అంటా నాభుజం మీద చెయ్యేసి పాట నేర్చుకోడంలో పడి పోయేరు.
* * *
ఏ మ్యూజిక్ డైరెక్టర్ పాట కంపోజ్ చేసినా పాడాల్సింది బాలూ.ఏ రికార్డింగ్ దియేటర్లో చూసినా కనిపించేది బాలూ,పొద్దుట్నుంచి పొద్దోయే దాకా పాడుతున్నది బాలూ,మ్యూజిక్ సంబంధించి ఎక్కడేం జరుగుతున్నా బాలూ బాలూ బాలూ.....
ఎప్పుడు లేస్తున్నాడో ఎప్పుడు తింటున్నాడో ఎప్పుడు పడుకుంటున్నాడో తెలీదు.ఎప్పుడూ ఎవర్నీ నొప్పిచ కుండా చిరు నవ్వుతా పాడుతానే ఉంటున్నాడు.
అలాంటి బాలూ సడన్ గా పాడ్డం మానేసేడు.అసలెవరికీ కనిపించడమే మానేసేడు,
బాలూకి త్రోట్ కేన్సరొచ్చిందంటన్నారు,అందుకే అతను కనిపించడం లేదంటన్నారు.ఇంకా చాలాచాలా అంటన్నారు.లెక్కలేనన్ని,.లెక్కెట్ట లేనన్ని అంటన్నారు.అప్పుడింకా టీవీ చానెల్స్ ముమ్మరం లేదు. ఐనా...తెలుగూ, తమిళం,కన్నడం,మలయాళం,ఆగ్లం ఇలా పేపర్ల నిండా రాతలే రాతలు.
సడెన్ గా ఆ వేళ ఇళయరాజా దియేటర్ కొచ్చి పాట పాడేరు బాలూ.అది కుకుకూ కుకుకూ కోకిల రావేఅన్న సితార సినిమాలో పాట.

అసలు జరిగిందేంటంటే....బాలూగారి ఓకల్ కార్డ్ మీద పొక్కు లాంటి దొకటొచ్చి పాడ నీ కుండా చాలా ఇబ్బందీ, చాలా బాధ పెట్టేస్తుంది. .
.దాన్ని రిమూవ్ చెయ్యడానికి అవస్థలు పడ్డ డాక్ఠర్లు, ఆపరేషనయ్యేక “ఇవ్వాల్టి నించీ మూడు నెలల పాటు చిన్న పలుకు కూడా పలక్కూడదు.గొంతుక్కి పూర్తి రెస్టు” అనేసి వార్నింగియ్యడంతో సైలెంట్ గా ఇంట్లో కూర్చుండి పోయారా బాలూ గారు.
అది తెల్సిన లతా మంగేష్కర్ గారు. అప్పుడప్పుడూ బాలూగారికి ఫోన్ చేసి “ మీరేం మాటాడ కండి నేను మాటాడుతుంటే “ఊ” అని కూడా అనొద్దు.సైలెంట్ గా వినండంతే” అంటా ఆవిడే మాటాడతా మధ్య మధ్యలో పాడతా ఉండే వారు.
మూడు నె ల్లు గడిచేకా ఆవేళ పొద్దుట ఆ పాటపాడిన బాలూగారు,ఆ సాయంత్రం పక్కనే ఉన్న ఏడిద నాగేశ్వర్రావుగారింటి కొచ్చి పొద్దుట పాడిన ఆ పాట ఒకటి రెండు సార్లు విని “బాగుంది” అనేసెళ్ళి పోయారు.
కొన్నేళ్ళు గడిచాయి
ఆవేళ సాయంత్రం నా పాట పాడి రికార్డింగ్ దియేటర్లోంచి బయటి కొస్తా “ఔనూ....నీకు మట్టుకే మైనర్ స్కేల్ లో ఇంత బాగా చేస్తున్నాడు రాజా. కారణ మేంటీ?.... ఇదే వాడ్న డిగితే నవ్వేసెళ్ళి పోతున్నాడు తప్ప జవాబు చెప్పడం లేదు.నువ్వు చెప్పు” అన్నారు.
నవ్వేసిన నేను “ఆయన నా మాట వినడం నా అదృష్టం కదాండి”
అంటా ఆయన్ని కారెక్కించేను.
అప్పుడెప్పుడో జరిగిన ఈ సంగతి ఈమధ్య స్వరాభిషేకం ప్రోగ్రాంలో సుమ{కనకాల}గారితో కూడా చర్చించేరు.

* * *
నేను తీసిన లాయర్ సుహాసిని అనే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఈయనే . ఒకపాట మ్యూజిక్ కంపోజింగ్ వాళ్ళింట్లో ఆయన బెడ్రూమ్ లో చేస్తూ నన్ను పిలిస్తే వేళ్ళిన నేను ఆ గదిలో ఉన్న ఒకే ఒక్క ఫొటో చూసి షాకయి పోయేను.
“నా ఫేవరేట్ యాక్టర్” అన్నారు.
అదెవరంటే కమలహాసన్.తనకిష్టమైందేదైనా సరే అంత బహిరంగంగా చెప్పేసే మనిషాయన.
ఎప్పుడూ ఆయన మెచ్చుకునే వాళ్ళ గురించే చెపుతారు గానీ,ఆయన్ని మెచ్చుకునే వాళ్ళ గురించి చెప్పరు గాక చెప్పరు అనడానికో ఉదాహరణ.......మహమ్మద్ రఫీ ఆయనకి దేవుడు.అసలు తను గాయకుడు కావడానికి ఆ దేవుడే కారణం.తన కోదండపాణి ఆడియో లేబ్ గుమ్మం దగ్గర గురువు కోదండపాణి గారి పెయింటింగ్ తో పాటు రఫీ గారి ఫొటో కూడా ఉండేది.ఐతే ,బాలూ గారు పాడిన చాలా పాటలు హిందీలో డబ్ చేసినప్పుడు,వాటిని పాడిన రఫీ గారు బాలూ గార్ని చాలా మెచ్చుకునే వారు.కానీ విచిత్రం....ఆ సంగతులు ఎప్పుడూ,ఎక్కడా,ఎవరికీ చెప్పలేదు బాలూ.

ఆవేళ కంపోజింగ్ లో ఆయన చేసిన ట్యూన్ నచ్చక పోయేటప్పటికి చెప్పేసి బయటి కొచ్చేస్తుంటే ఏమాత్రం ఫీలవ్వకుండా మర్నాడు మధ్యాన్నం జెమినీ లోఎవరిదో పాడొస్తా దార్లో అనుకున్న ఒక అద్భుత మైన ట్యూన్ ఇంటి కొచ్చిన వెంటనే డెమో కేసెట్లో రికార్డ్ చేసి ఎప్పుడూ వాళ్ళ దగ్గరుండే సౌండ్ ఇంజనీర్ రమేష్ తో పంపించేరు.
దివిని తిరుగు మెరుపు లలన సామజవర గమనా..... సీతారామ శాస్త్రిగారు రాసిన లిరిక్ కి ట్యూన్ చేసిన ఆ పాట నాకు చాలా నచ్చింది అదే ఆయనకి ఫోన్ చేసి “చాలా బాగుంది సార్.ఫిమేల్ వెర్షన్ బాగా పాడేరు శైలాగారు.రేపు ఆవిడ తోనే పాడిద్దాం” అన్నాను.
“ట్యూన్ పాడింది మా చెల్లెలు గదా అని మెయిన్ ట్రేక్ లో పాడించడం లాంటివి పెట్టుకోకు.ఆ ట్యూన్ కి తన వాయిస్ నీకు నచ్చితేనే” అన్నారు.
“ మీసొంత మనుషుల విషయంలో మీరెంత నిర్మొహమాటో నాకు తెల్సు ఆ ట్యూన్ కి ఆవిడ గొంతు బాగుందండీ.”
* * *
“ నీకు తెల్సు చాలా ప్రతిభ గలవాడు ఆ వెన్నెలకంటి.స్టేట్ బేంక్ లో పనిచేస్తా శలవు పెట్టి వచ్చి పాటల కోసం ట్రై చేస్తున్నాడు. ఆమధ్య మహర్షి సినిమాలో ఒక అద్భుతమైన పాట ఇచ్చేవు.అలాంటివో రెండు మూడిస్తే సెటిలై పోతాడయ్యా అతనూ” అన్నారా వేళ.
ఆయన చెప్పేరు గదాని అప్పుడు చేస్తున్న చెట్టు కింద ప్లీడరు సినిమాలో చల్తీ కా నామ్ గాడీ పాటా,అల్లిబిల్లి కలలా రావే అన్న పాటా ఇచ్చేను.

***
బేంక్ లో పని చేసే చంద్రమోహన్ గారి మేనల్లుడు శివలెంక కృష్ణప్రసాద్ చిన్నోడు పెద్దోడు ,అన్న సినిమా తీస్తా బాలూ గార్ని మ్యూజిక్ డైకెక్టర్ గా పెట్టుకున్నాడు.

ఆ“చిన్నోడు పెద్దోడు” సినిమా ప్రొడక్షన్ టైములో క్రిష్ణప్రసాద్ హార్డ్ వర్కింగ్ చూసిన బాలూ గారు నువ్వో పెద్ద సినిమా తియ్యాలని అతన్తో దెబ్బలాడేసిన తర్వాత బాలక్రిష్ణగారితోనూ,సింగీతం గారి తోనూ,ఇళయరాజా గారితోనూ మాటాడి పెద్ద సినిమా తీయించేరు.అదే ఆదిత్య369.ఆ ఎంకరేజ్మెంట్ తో మంచి ప్రొడ్యూసర్ గా నిలబడి పోయాడా కృష్ణప్రసాద్.
“ సినిమా పేరడైజో,క్రిస్టోఫ్ కిస్లవస్కీ కలర్ ట్రయాలజీ డివీడీలు నాకు కావాలి.ఇంటర్నేషనల్ కరెన్సీకార్డ్ నాకు లేదు యాభై యూరోలకి మీరు సంతకం పెడతారా ?”అని నెనడిగితే “ఇంత చదవక్కర్లేదు.అవతల నాకు టేక్ టైమవుతుంది” అంటా నా చేతిలో పెన్ తీసుకుని సంతకం పెట్టేసి నన్ను బయటికి గెంటేసేరు.
అది చూసిన ఆయన సెక్రటరీ విఠల్ గారు వెనకటికి బాలూ ఇలా సంతకం పెట్టి పీకల్దాకా ఇరుక్కు పోయిన కథ ఒకటుంది.అన్నారు.
నాది కేవలం ఏభై యూరోల కథ ఇండియన్ కరెన్సీ ఇక్కడ మీకిచ్చేస్తాను.అనేటప్పటికి నవ్వేసినా విఠల్ గారు ఆయన సంతకం పెట్టడం చూస్తుంటే ఆనాటి ఆ కథ గుర్తొచ్చి అన్నానంతే అన్నారు.
ఏంటి సార్ ఆ కథ?
పేరు బయటికి చెప్పడం బాలూ గారికి ఇష్టం ఉండదు గాబట్టి ఈయన మిత్రుడు తీస్తున్న ఒక సినిమా.మీరు సంతకం పెడితే ఫైనాన్షియర్ డబ్బిస్తాడు అంటే పెట్టేరు బాలూగారు.ఆ సినిమా తేడా రావటం లాంటదేదో జరిగితే ఆ మొత్తం డబ్బు బాలూ గారు కట్టాల్సొచ్చింది.అనా విఠల్ గారు చెపుతుంటే సంతకం చెయ్యడం చూసిన ఆయన కిదంతా గుర్తు కొచ్చిందన్నమాట.అనుకుంటా బయటి కొచ్చేను.
* * *
ఆయన అమెరికా గానీ వెళ్ళడం జరిగితే తిరిగొచ్చేటప్పటికి దియేటర్లలో కుప్పలు తెప్పలుగా పడుండేవి ట్రాక్స్.
నవ్వుతానే చుట్టూ వున్న వాళ్ళని నవ్విస్తానే రాత్రీ పగలనక కష్టపడి పాడేవారా ట్రేక్సన్నీ.
అలా పాడి సంపాదించిన డబ్బు చాలా పోగెయ్యాలి ఆయన.
కానీ,
పోగెయ్యలేదు.
ఆ వర్క్ హాలిక్ స్నేహానికిచ్చిన విలువ డబ్బు కియ్యలేదు.సాయాని కిచ్చిన విలువ డబ్బు కియ్యలేదు.అసలు ఆయన కున్నంత మంది స్నేహితులు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ లేరని పిస్తుంది.
అన్ని వేల పాటలు పాడిన బాలూగార్ని ఎన్నివేల మంది కల్సుంటారు.వాళ్ళపాట క్వాలిటీ వాళ్ళకి కావల్సిన విధంగా రావడానికి ఎన్ని విథాలుగా చెప్పుంటారు,చర్చించి ఉంటారు?
వాళ్ళందరి మధ్యా నవ్వుతా కల తిరుగుతా తెలుగు సరే అది తమిళం అచ్చం తమిళ వాడు పాడిన తమిళపాట లాగ పాట లాగా ,కన్నడం అయితే అచ్చం కన్నడిగుడు పాడిన కన్నడం పాట లాగ అది ఏ భాషైతే అచ్చం ఆ భాషవాడు పాడిన పాటలాగ పాడేసి కన్సోల్ రూమ్ లో ఉన్నవాళ్ళతో మా గొప్పగా ఒప్పించు కుని,మెప్పించు కుని బయటి కొచ్చేవారు.
అలాగే తెలుగులో పాడుతా తీయగా,కన్నడంలో యెద తుంబె హదువేను... ఎందర్నో ఎంకరేజ్ చేస్తా ఎంతో మంది సింగర్స్ ని తయారు చేసేరు.ఓడి పోయిన వాళ్ళెంతో మందిని తిరిగి నెగ్గేలా ఎంకరేజ్ చేసేరు? ఇన్ని లక్ష్మల మందిలో ఏ ఒక్కడ్నన్నా నొప్పించేరా?బాధపెట్టేరా?.అసలీ ప్రపంచంలో ఆయన్ని శత్రువులా చూసే వాడే లేడా???

ఇంత హుషారుగా నవ్వుతా ఇన్ని లక్ష్మల మందికి అస్మదాప్తుడైన శ్రీ ఎస్పీ.బాలసుబ్రమణ్యంగారికి బాధలు లేవనా?
అవస్థలు లేవనా?
చాలా ఉన్నాయి.
చాలా చాలా ఉన్నాయి.
* * *
ఎన్ని రంగుల జ్ఞాపకాలు
ఎన్నో హంగుల జ్ఞాపకాలు
తడిసిన ఆ జ్ఞాపకాలు
మెరిసిన ఆ జ్ఞాపకాలు
మాట్లాడిన జ్ఞాపకాలు
పోట్లాడిన జ్ఞాపకాలు
శృతిమారిన జ్ఞాపకాలు
పొలమారిన జ్ఞాపకాలు
ఇది సి నిమాపాట కాదు. టీవీ ప్రోగ్రామ్స్‌‌కి సంబంధించింది గానీ వెబ్‌‌కి సంబంధించింది గానీ మరి దేనికి సంబంధించిందీ కాదు.
నా ఆత్మీయ మిత్రుడు డాక్టర్ చంద్రశేఖర్‌‌కి సంబంధించింది. ఔను. లాస్టియర్నించి స్వాతిలో రాసి ఆ తర్వాత నా ఫేస్‌‌బుక్ పేజీలో నేను పెడ్తున్న పొలమారిన జ్ఞాపకాల్ని వెబ్‌‌సిరీస్ చేద్దామని దానికి రాసిన టైటిల్ సాంగ్ తాలూకు పల్లవిని ఆ శేఖర్‌‌గారికి పంపిస్తే మొత్తం పాట రాసేకా ఒకపాటగా రికార్డ్‌‌ చేసి నాకివ్వండి అన్నారు.
“ఎందుకూ?” అన్నాను.
“రోజూ నాకార్లో పెట్టుకుని నేను మాత్రం వినడానికి.”
“ఏంటీ?”

“ఔను” అంటా నవ్వేసిన శేఖర్ అదే ముక్క చాలా సీరియస్‌‌గా చెప్పేటప్పటికి ఈ లాక్‌‌డౌన్ టైములో నాలుగ్గోడల మధ్య కూర్చుని పాట రాసేకా ట్యూనూ, బేక్‌‌గ్రౌండ్సూ కంపోజ్ చేసి రికార్డ్‌‌ చేసిన ఆ పాట శేఖర్‌‌గారి కిస్తే ఇంతా అంతాగానంత ఇదితో దాన్నందుకున్న ఆ పెద్ద మనిషి ప్రతి రోజూ ఆఫీసుకెళ్ళేటప్పుడు కార్లో ఆ పాట వినే పనిలో పడ్డారు.
***
టీవీ5లో బిజినెస్ ఎడిటరయిన నా ఫ్రెండ్ వసంత్‌‌కి ఎస్పీ బాలూగారంటే ఆరో ప్రాణం.
అసలాయన వాయిస్‌‌ తప్ప మాగొప్పోడైన మహమ్మద్‌‌ రఫీ లాంటోడి వాయిస్‌‌ కూడా వినని వసంత్‌‌, రాక్షసుడు సినిమా డైరెక్టర్‌‌ రమేష్‌‌వర్మతో పాటు నా దగ్గర కొచ్చేరావేళ.
నాకు లాంగ్‌‌ డ్రైవ్స్‌‌ అంటే చాలా ఇష్టమని తెల్సిన వసంత్‌‌ అలా సంగారెడ్డి దాకా వెళ్లొద్దామా అంటా డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టార్ట్‌‌ చేసాడు.
ముత్తంగి చర్చి దాటాకా నా జేబులో వున్న పెన్‌‌డ్రైవ్‌‌ వసంత్ ప్లేయర్లో గుచ్చేటప్పటికి ఈ జ్ఞాపకాల పాట విన్న వసంత్ బాగుంది పాడిందెవరు?

ఎవరో అంటా చెప్పేను.

“ఈ పాట మన బాలుగారు పాడితే అలాగిలాగుండదు” అన్నాడు వసంత్.
“ఔను నిజమే” అన్నాడా రమేష్ వర్మ.
వాళ్ళలా మాటాడుకుంటుంటే పూర్వం చాలా మంది ట్రాక్ సింగర్స్‌‌ పాడిందానికీ తరువాత బాలుగారొచ్చి పాడిందానికీ వచ్చిన మా గొప్ప తేడా గురించి తెల్సిన నేను వీళ్ళు చాలా సబబుగా మాటాడ్తున్నారనిపించింది.
“సార్ మీరు మ్యూజిక్ చేసినీ పాట మనం బాలూగారు పాడ్డం జరిగితే మరిలాగలాగుండదు. మీరు కొత్తగా మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తాల్సొస్తుందేమో అనిపిస్తుంది అంటా చాలా దూరం డ్రైవ్ చేసినా వసంత్ దారి పొడుక్కీ ఇదే పాట ఎన్ని సార్లు విన్నాడో ఆయనకే తెలీదు.
“రేపు మా బాలూగార్ని కల్సి ఈ పాట గురించి మాటాడ్తాను” అంటా కొట్లారులో నా ఫ్లాట్‌‌ ముందు దించెళ్ళిపోయేడు.
***
ఆ సాయంత్రమే ఫోన్ చేసి అర్జంటుగా నన్ను కల్సినా వసంత్ షాకయిపోతా నన్ను చూస్తా జరిగిందంతా చెప్పేడు.
సారధీ స్టూడియోలో పాడుతా తియ్యగా ప్రోగ్రామ్ చేస్తున్న బాలూగార్ని కల్సిన వసంత్ విన్న జ్ఞాపకాల పాట గురించి చెప్పి “మీరు పాడితే మామూలుగా వుండదు సార్” అన్నాడు.

“ఎవరు మ్యూజిక్ డైరెక్టరు?” అడిగేరు.
చెప్పేడావసంత్.
విన్న బాలూగారు “అతనింతకు ముందు నాలుగైదు సినిమాలకి మ్యూజిక్ చేసేడు తెలీదా వసంత్ మీకు?”
“తెలీదు సార్”
“నాలుగు పాటలు ఇళయరాజా చేస్తే ఐదో పాట ఇతనే లిరిక్కు, మ్యూజిక్కూ చేసేడు.”
“ఔనా!!!”
“యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా.... ప్రేమయాత్రలకి బృందావనమూ నందనవనమూ ఏలనో”
“ఔనా!!!”
“ఔనా.... అంటారండీ. ముందు విషయం చెప్పండి.”
“ఈ జ్ఞాపకాల పాట మీరు పాడాలి సార్”
“తప్పకుండా పాడతాను కరోనా వెళ్ళొద్దూ అంటా నా వైఫ్ సావిత్రి గొడవ చేస్తే కాదంటా వచ్చేను. వచ్చే ఫిఫ్టీన్త్ వచ్చినప్పుడు మా సెక్రెటరీ చందూ డేట్

చెప్తాడు దియేటర్ బుక్ చేసుకోండి”
జరిగిందంతా నాకు చెప్పినా వసంత్ “మీరు మ్యూజిక్ చేసినట్టు నాకెందుకు చెప్పలేదూ?” అంటా నిలదీసేడు.
“చెప్పేను సార్ అప్పుడు మనం జింకానా క్లబ్బులో వున్నాం”
“ఉంటే?”
“ఉంటే అంటారేంటీ... మీకు బాలుగారు తప్ప ఇంకేం వినపడవు గదా. అప్పుడప్పుడూ ఒక్క ఇళయరాజా పేరు మట్టుకు చెప్తుంటారు. మిగతా ఇంకెవరి గురించి చెప్పరు వినరు”
కాళ్లు మూసుకుని అంతా విన్న వసంత్ “వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు చేసిందేమీ నాకు ఎక్కదు సార్”
“ఆ మిగతా వాళ్ళలో నేనూ ఒక్క‌డ్ని సర్... డేటు ఎప్పుడిచ్చారు?”
చెప్పేడు వసంత్.
***
బాలూగారు హాస్పిటల్లో చేరేరన్న వార్త ఆ తర్వాత ఆయన బానే వున్నారని శైలజ చెప్పడం అది గాదులే అంటా చరణ్ చెప్పడం
నన్ను ఫోన్లో కల్సిన వసంత్ “మన బాలూగారు తొరలోనే వచ్చేసి పాడేస్తారు అంటున్నారు.
రోజులు గడుస్తున్నాయి.
నేను చేసిన జ్ఞాపకాల పాట బాలూగారు పాడేకా అని ఊహించుకుంటున్నాను. ఆయన వాయిస్ నాకేం కొత్తగాదు గానీ ట్యూన్‌లో ఆయన గొంతు పడ్డాక ఆ పాటే వేరు. అది నాకు చాలా బాగా తెల్సు. అందుకే ఎదురుచూస్తున్నాను.
***
గెడ్డం పెంచేసుకున్న చరణ్ ఆయన హెల్త్ రిపోర్ట్ చెప్తుంటే దేశంలో వున్న మొత్తం జనంతోపాటు ఆత్రంగా వింటా మరి రేపే వార్త చెపుతాడో చక్కని శుభవార్త చెప్పాలి అనేసి ఎదురుచూస్తున్నాం.
***
ఆవేళ క్లీన్ షేవ్‌తో నవ్వుతా కనిపించిన ఆ ఎస్పీ చరణ్ “నాన్నగారికి నెగిటివ్ వచ్చింది” అన్న శుభవార్త చెప్పేటప్పటికి వింటూ ఎగిరి గంతేసిన వసంత్ “ఈ రాత్రికి పార్టీ నేనిస్తాను సేమ్ జిమ్‌కానా క్లబ్‌లో. వచ్చేవారమే మన రికార్డింగ్” అంటా చాలా అల్లరి చేసేడు.
అలా చేసినా మనిషి సైలెంట్‌గా ఊరుకున్నాడా అంటే లేదు.
ఆ రాత్రి కారేసుకొచ్చి నన్నెక్కించుకున్నాక రింగ్‌రోడ్ ఎక్కి రెండు బాటిల్స్‌లో మిక్స్ చేసిన మందు నాకిస్తా పార్టీ అంటూ పోనిచ్చేడు.
ఆ రింగ్ రోడ్లో ఎన్ని రౌండ్లు తిరిగేమో మాకే తెలీదు.
తెల్లవారగానే........
బాలుగారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం చనిపోయేడన్న దారుణమైన వార్త టీవీలో, ఫేస్‌బుక్కులో ఇంకా ఎక్కడ బడితే అక్కడ.

వింటున్న నాకు, చూస్తున్న నాకు అర్థంగావట్లేదు. అది నిజం అన్న మాట నా సొంతం కావట్లేదు. మీకేవన్నా మెంటలా?విడ్డూరం గాపోతే ,అసలు బాలూగారు చనిపోవడం ఏంటీ!!!

అసలిది ఎప్పుడన్నా ఊహించేమా!! .....కలా..నిజమా...నిజంలో కలా....అసలేంటిదీ ...ఏమాత్రం అర్ధం కావటం లేదు??.

అప్పుడప్పుడూ అమెరికా వెళ్ళినట్టు,ఇప్పుడు కూడా ఎక్కడికో చాలా చాలా దూరం వెళ్ళేరు.ఇప్పడో మరెప్పుడో వచ్చేస్తారు.....వచ్చేస్తారు.......ఈ ఫీలింగ్ నా ఒక్కడి ది మట్టుకే కాదు ప్రపంచం మొత్తానిది.ఆయన చనిపపోయేరంటే కొట్టడాని కొచ్చేవాళ్ళు కూడా ఉన్నారు.

ప్రేమకి వెల కట్టలేని కొన్ని అధ్బుతాలు జరిగాయీ మధ్య.....బెంగళూరు లో ఒక రోడ్ కి బాలూగారి పేరు పెట్టేరు.కోయంబత్తూరు దగ్గర బాలూ గారి పేర్న ఒక వనం నిర్మించి అందులో మొక్కలకి బాలూ గారి పేరే పేరే పెడతారంట.ఇవి ఇప్పటికి.ఇకముందు ఇంకా ఎన్నెన్ని జరుగుతాయో.... జరగ బోతాయో.

సరే చిట్ట చివరి కొస్తే........

చెప్పిందే మళ్ళీ చెపుతున్నాను.నా “ఈ చిన్ని జీవితంలో నాకు గొప్పోళ్ళు ముగ్గురే ఇళయరాజా, బాపుగారు, బాలుగారు. వాళ్ళు మేధావులు. వందేళ్ళకొకసారన్నా పుడతారో లేదో ”

ఐతే.... నాకొకటని పిస్తుంది.....

బేతొవెన్ మళ్ళీ పుట్టేడా? హేండిల్ మళ్ళీ పుట్టేడా? మొజార్ట్ మళ్ళీ పుట్టేడా? ఇవన్నీ ఎందుకూ ద గ్రేట్ ఘంటసాల మాష్టారు మళ్ళీ పుట్టేరా??
వీరిలో ఎవరైనా మళ్ళీ పుట్టొచ్చేమో గానీ ......... శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం మళ్ళీ ఇక పుట్టడం జరగదని.ఎందుకంటే మళ్ళీ పుట్టడానికి ఆయన మరణిస్తే గదా!!!

***

.